-
త్వరలో అందుబాటులోకి సీ ప్లేన్లు
-
45 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు
-
రెండు రాష్ట్రాల మధ్య పట్టాలెక్కనున్న పర్యాటక ప్రాజెక్ట్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. త్వరలో ఒక పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సీ ప్లేన్ సేవల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు, రైలు, సాధారణ విమానాల రాకపోకలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నీటి పైన టేక్ ఆఫ్ తో గాల్లో ప్రయాణించే సి ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా మరింత సులభతరం కానుంది.
-
రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆలోచన..
హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సిప్లేన్ నడపాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిసి ఆలోచన చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జూలైలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఈ అంశంపై చర్చించారు.
దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం హుస్సేన్ సాగర్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నీటి లోతు, టేక్ ఆఫ్ ల్యాండింగ్ కు అనువైన ప్రాంతాలు, జెట్టీలు, భద్రతా అంశాలపై సమీక్ష చేసింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఇలాంటి సర్వే జరగనుంది. సాధారణ రన్వే అవసరం లేకుండానే నీటిపైనే ఈ సీ ప్లేన్లు ఎగురుతాయి. దిగుతాయి కూడా.
-
తక్కువ ఎత్తులో ప్రయాణం..
ఈ సి ప్లేన్లు అనేవి తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తాయి. వీటిలో 9 నుంచి 12 మంది ప్రయాణికులు సామర్థ్యం ఉంటుంది. హుస్సేన్ సాగర్ నుంచి బయలుదేరితే బుద్ధ విగ్రహం, సచివాలయం, ట్యాంక్ బండ్ అందాలు ఆకాశం నుంచి కనిపిస్తాయి. హుస్సేన్ సాగర్ నీళ్లపై సిప్లేన్లో ఎగిరి… ప్రకాశం బ్యారేజీ లో దిగేలా ప్లాన్ చేస్తున్నారు.
కృష్ణానది మీదుగా ప్రయాణించి.. కృష్ణమ్మ అందాలను చూస్తూ ప్రకాశం బ్యారేజీలో దిగొచ్చు. సహజంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే రోడ్డు మార్గంలో ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది.
రైలులో అయితే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. కానీ సిప్లేన్ తో దాదాపు 40 నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. పర్యాటకులతోపాటు వ్యాపారులకు ఇది చక్కటి మార్గం. దీంతో తెలుగు రాష్ట్రాల పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయవచ్చు.
