Football Lily: భూమిపై ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉండేలా ప్రకృతి అద్భుతాలను సృష్టించింది. అలాంటి అరుదైన విశేషాల్లో సంవత్సరానికి కేవలం ఒకసారి మాత్రమే పూసే మొక్కలు కూడా ఉంటాయి. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మే నెలలో మాత్రమే వికసించే అరుదైన పుష్పం. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఈ అరుదైన దృశ్యం ప్రత్యక్షమవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కోస్గికి చెందిన ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం తన ఇంటి టెర్రస్ గార్డెన్లో పెంచిన ఈ మొక్క ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సంవత్సరంలో కేవలం మే నెలలో ఒక్కసారి మాత్రమే పూసే ఈ పుష్పం అందం చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ అరుదైన మొక్క శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ కాగా, సాధారణంగా పుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అని పిలుస్తారు. ఇది అమరిల్లిడేసి కుటుంబానికి చెందిన దుంపకాండ మొక్కగా గుర్తించబడింది. బ్రిటిష్ కాలం నుంచే ఈ మొక్క భారతదేశంలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకత ఏమిటంటే, ఈ మొక్క సంవత్సరంలో మిగతా సమయాల్లో కనిపించకుండా మట్టిలో దాగి ఉండి, కేవలం మే నెలలో మాత్రమే మొగ్గలు తొడిగి అందమైన పుష్పాలను ఇస్తుంది. ఈ కారణంగానే దీనిని మే పుష్పం అని కూడా పిలుస్తారు.
వార్ల మల్లేశం ఈ మొక్కపై ఆసక్తితో ఆంధ్రప్రదేశ్లోని పాడేరు ప్రాంతం నుంచి సుమారు 10 సంవత్సరాల క్రితం దుంపను తెచ్చి కుండీలో నాటారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మే నెలలో ఈ మొక్క పువ్వులు ఇస్తూ వస్తోంది. మొదట్లో ఒక్క పువ్వు మాత్రమే పూసేదని, గత సంవత్సరం 4 పుష్పాలు పూయగా, ఈసారి 5 పుష్పాలు వికసించాయని మల్లేశం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుష్పాలు సాధారణంగా జూన్ నెల వరకు మాత్రమే నిలిచి, ఆ తరువాత రాలిపోతాయి. తర్వాత మొక్కకు ఆకులు వచ్చి జనవరి వరకు కొనసాగి, తరువాత అవి కూడా ఎండిపోతాయి. మిగతా కాలంలో దుంప మాత్రమే మట్టిలో దాగి ఉండటం ఈ మొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఒకసారి దుంపను నేలలో నాటితే అది చనిపోకుండా ప్రతి సంవత్సరం పుష్పాలు ఇవ్వడం మరో విశేషం.
ఈ అరుదైన పుష్పం వికసించిన విషయం తెలిసిన వెంటనే కోస్గి పట్టణ ప్రజలు మల్లేశం ఇంటికి చేరుకుని ఆ అందాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు క్యూ కట్టారు. ఈ పుష్పం అందం చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత సౌందర్యం సోషల్ మీడియాలో కూడా వేగంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ASLO READ: Gold Rates: కొనుగోలు దారులకు గుడ్ న్యూస్…మరింత దిగువకు చేరిన బంగారం ధరలు …!ఈ రోజు ఎంతంటే..