Homeక్రైమ్ఫేస్‌బుక్ పరిచయం.. నకిలీ ట్రేడింగ్ వలలో దంత వైద్యుడు.. రూ.14.61 కోట్లకు టోపీ

ఫేస్‌బుక్ పరిచయం.. నకిలీ ట్రేడింగ్ వలలో దంత వైద్యుడు.. రూ.14.61 కోట్లకు టోపీ

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాటలను నమ్మిన 44 ఏళ్ల దంత వైద్యుడు నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ.14.61 కోట్లు నష్టపోయారు. తెలంగాణలో ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ సైబర్ మోసాల్లో ఇది ఒకటిగా అధికారులు గుర్తించారు. బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన దంత వైద్యుడికి ఆగస్టు 27న ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ‘మోనికా మాధవ్’ అనే మహిళ పరిచయమైంది. తాను చెన్నైకి చెందిన వ్యక్తినని, ప్రస్తుతం విడాకుల ప్రక్రియలో ఉన్నానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలం చాటింగ్ చేసిన అనంతరం టెలిగ్రామ్‌లో మాట్లాడాలని సూచించింది. తాను ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా ప్రతిరోజూ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పి వైద్యుడిని నమ్మించింది.

ఆ తర్వాత ‘cmcmarketsltd.com’ అనే వెబ్‌సైట్‌లో ట్రేడింగ్ ఖాతా తెరవాలని ఆమె సూచించింది. ఆమె మాటలు నమ్మిన వైద్యుడు తన ఆధార్ వివరాలను సైతం ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఖాతా ప్రారంభించారు.

మొదట లాభాలు చూపించి నమ్మకం

మోసగాళ్లు ముందుగా చిన్న మొత్తంతో వైద్యుడి నమ్మకాన్ని పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 3న ఆయన రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టగా, కొద్ది సమయంలోనే రూ.8.6 లక్షల లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపించారు. అంతేకాకుండా అందులో నుంచి రూ.85 వేల మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో వెబ్‌సైట్ నిజమైనదేనని భావించిన వైద్యుడికి అనుమానం రాలేదు.

ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించారు. మోనికా కూడా తాను పెట్టుబడి పెడతానని, ఇద్దరూ కలిసి రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది.

అప్పులు చేసి మరీ భారీ పెట్టుబడి

ఆమె మాటలు నమ్మిన వైద్యుడు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పులు చేసి విడతల వారీగా భారీ మొత్తాలను బదిలీ చేశారు. ఇలా మొత్తం రూ.14.51 కోట్ల వరకు నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన ఖాతాలో మొత్తం రూ.34 కోట్ల లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపించారు.

అయితే ఆ మొత్తాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. విత్‌డ్రా ఆప్షన్ పనిచేయకుండా పోయింది. డబ్బును విడుదల చేయాలంటే పన్నుల పేరుతో మరో రూ.7.5 కోట్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు.

మహిళ కాంటాక్ట్ కట్.. మోసం బయటబయలు

ఈ పరిణామాల మధ్య ‘మోనికా మాధవ్’ వైద్యుడిని తన కాంటాక్ట్‌ల నుంచి బ్లాక్ చేసి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు.

ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితుడు మొత్తం 91 సార్లు డబ్బును బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ నగదు 10 రాష్ట్రాల్లోని సుమారు 40 బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66-డీతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ వెనుక ఉన్న వ్యక్తులు, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు, ఈ మోసంలో పాల్గొన్న ఇతరుల వివరాలను TGCSB అధికారులు సేకరిస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

also read: తెలంగాణలో కొత్తగా 41 బార్లు.. నేటి నుంచే దరఖాస్తులు.. లాటరీలో ఎంపిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు