*తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తిట్ల దండకం
*కౌంటర్ ఇవ్వలేకపోతున్న బిజెపి నాయకత్వం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో ; తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆయనను తెలంగాణ సీఎం గా ఉన్న కెసిఆర్ టార్గెట్ చేసుకునేవారు. ఆయనపై తిట్ల దండకానికి దిగేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అదే పని చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని విమర్శించే క్రమంలో ప్రతిసారి కిషన్ రెడ్డి టార్గెట్ అవుతుండడం విశేషం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ కేంద్రంలో ఉన్న బిజెపి పై ఘర్షణ వైఖరితో ఉండేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం రాష్ట్రాభివృద్ధి విషయంలో బిజెపి అడ్డుతగులుతోందని.. కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి కేసిఆర్ తో చేతులు కలిపారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిని నేరుగా ఎదుర్కొనలేకపోతున్నారు కిషన్ రెడ్డి. బిజెపి శ్రేణులు కూడా తిప్పి కొట్టలేకపోతున్నాయి.
అంచలంచెలుగా ఎదుగుతూ..
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు కిషన్ రెడ్డి. 1977లో జనతా పార్టీ యువ నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980 నుంచి బిజెపిలో క్రియాశీలక నేతగా పనిచేస్తూ వచ్చారు. ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కూడా కొద్ది రోజులపాటు వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. వివిధ రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. అటువంటి నేత గతంలో కేసీఆర్ కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి టార్గెట్ అవుతుండడం విశేషం.
కెసిఆర్ తీవ్ర దూషణలు..
9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కెసిఆర్. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబించేవారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేయడం పరిపాటి గా మారేది. ఒక దశలో ఆయన కిషన్ రెడ్డిని రండ, చేతకాని దద్దమ్మ అన్న అనుచిత పదజాలంతో విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు కెసిఆర్ బాధ తప్పింది అనుకుంటే రేవంత్ వచ్చారు. కెసిఆర్ తరహాలోనే సీఎం రేవంత్ సైతం విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నుంచి సహకారం రాకుండా కిషన్ రెడ్డిని అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నెల 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా రేవంత్ బిజెపిలో ఉంటూ కేసిఆర్ తో స్నేహం చేసే గుణం కిషన్ రెడ్డిది అని.. ఈ విషయం వారి సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు అంటూ చురకలు అంటించారు.
తిప్పి కొట్టలేకపోతున్న బిజెపి..
భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అపనమ్మకం కలిగేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రేవంత్ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఎంపీల మధ్య అస్సలు పడడం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నట్టు పరిస్థితి ఉండేది. మధ్యలో ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. పార్టీలో ఫ్లెక్సీలు రాగడ నడుస్తోంది. ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పార్టీకి చెందిన కేంద్రమంత్రి పై తెలంగాణ సీఎం రేవంత్ విమర్శలు చేస్తుంటే… కనీసం తిప్పి కొట్టలేకపోతోంది బిజెపి నాయకత్వం. ఇది ఆ పార్టీకి చాలా లోటు కూడా..