క్రైమ్ మిర్రర్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఫరూక్నగర్ మండలం కందివనం గ్రామంలో నాలుగేళ్ల పసిపాపపై ఒక వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందివనం గ్రామానికి చెందిన గొల్ల చంద్రయ్య (62) అనే వ్యక్తి గురువారం సాయంత్రం తన ఎదురింటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కొద్దిసేపటి తర్వాత తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారిని చూసి తల్లి దిగ్భ్రాంతికి గురైంది.
పాపను విచారించి విషయాన్ని గ్రహించిన తల్లి, ఎదురింట్లో ఉన్న చంద్రయ్యను నిలదీసింది. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో పక్కనే ఉన్న కర్రతో అతని తలపై దాడి చేసింది. బాధితురాలి తల్లి కేకలు విని అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, విషయం తెలుసుకుని చంద్రయ్యపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన చిన్నారితో పాటు నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
also read:ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం!
