కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కరుప్పు’ ప్రస్తుతం థియేటర్లలో భారీ స్పందనతో దూసుకుపోతోంది. మే 15న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఈ జోరును కొనసాగిస్తే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా, దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా ప్రతినాయక పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఇంద్రాన్స్, అనాఘా మాయ రవి, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్.
ఈ సినిమా విజయంతో పాటు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరో ఆసక్తికర విషయం చర్చకు వస్తోంది. ఈ కథ మొదట సూర్య కోసం కాదు.. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారనే విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు ఆర్జే బాలాజీ ఇటీవలే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ కథను మొదట 2023 ఆగస్టులో విజయ్‌కు వినిపించినట్లు వెల్లడించారు. కథ వినగానే విజయ్ ఆసక్తి చూపి వెంటనే సినిమా చేద్దామనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే పూర్తి కథా రూపకల్పనకు సమయం పట్టడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు.
ఆ తర్వాత విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని, అనంతరం కథలో కొన్ని మార్పులు చేసి సూర్యకు వినిపించగా ఆయన వెంటనే అంగీకరించినట్లు సమాచారం. చివరికి ఆ నిర్ణయం ఇప్పుడు సూర్య కెరీర్‌లోనే అత్యంత పెద్ద విజయాల్లో ఒకటిగా మారింది. ఇప్పటికే ఈ చిత్రం సూర్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని నివేదికలు చెబుతున్నాయి.
ALSO READ: హైదరాబాద్‌లో జరిగిన స్టోరీ.. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది..