పైన కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పెద్దదై పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగు సినీరంగంలో బాలనటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో చిరంజీవికి మేనకోడలిగా కనిపించిన ఆమె తన సహజమైన నటన, టైమింగ్, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే చిత్రంలో నటించిన సమీరా రెడ్డి, భూమిక చావ్లాలతో కలిసి నటిస్తూ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె మరెవరో కాదు.. బాలనటి శ్రియ శర్మ. చిన్న వయసులోనే యాడ్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. సుమారు 5 నుంచి 6 సంవత్సరాల వయసులోనే తెరపై కనిపించడం ప్రారంభించింది. జై చిరంజీవ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించి, ఆ తర్వాత తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో మహేష్ బాబు నటించిన దూకుడు, రామ్ చరణ్ నటించిన రచ్చ, అలాగే నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.
బాలనటిగా మాత్రమే కాకుండా కథానాయికగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది శ్రియ శర్మ. ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో ఆమె కెరీర్‌లో పెద్ద మలుపు రాలేదు. దీంతో కొంతకాలం పాటు సినీరంగానికి దూరంగా ఉంటూ తన చదువుపై దృష్టి సారించింది. 2016 సంవత్సరంలో వచ్చిన నిర్మలా కాన్వెంట్ సినిమానే ఆమె చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ శర్మ ఇప్పుడు పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె రచయితగా మారి “కర్మ బ్యాక్ ఫైర్డ్” అనే పుస్తకాన్ని రచించింది. తనలోని సృజనాత్మకతను మరో రూపంలో బయటపెడుతూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తాజాగా 29వ ఏట అడుగుపెట్టిన ఆమె తన పుట్టినరోజును సంతోషంగా జరుపుకుంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అవి ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. బాలనటిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు రచయిత్రిగా కొత్త మలుపు తీసుకోవడం విశేషం. ఇప్పటివరకు 150కి పైగా యాడ్స్‌లో నటించి తన ప్రతిభను నిరూపించుకున్న శ్రియ శర్మ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన దిశలో ముందుకు సాగుతోంది.
ALSO READ: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు రిలీఫ్.. మరో కొత్త ఆప్షన్ వచ్చేసింది..
