-
నలిగిపోతున్న కాంగ్రెస్ క్యాడర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఇద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయా? ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితా? ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు ఎందుకు గైర్హాజరవుతున్నారు? ఇంతకీ ఎవరు ఆ నేతలు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గడ్డం వివేక్. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు ప్రచారం నడుస్తోంది.
సీనియర్ నేత…
ఉమ్మడి రాష్ట్రంలోనే దామోదర్ రాజనర్సింహకు మంచి పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు కూడా. కానీ ప్రస్తుతం ఆయన మరో మంత్రి వివేక్ తో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆది నుంచి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. వివేక్ మాత్రం పార్టీలు మారుతూ.. చివరకు కాంగ్రెస్లో చేరారు.
ఆయన స్వయాన వెంకటస్వామి కుమారుడు. వెంకటస్వామి కాంగ్రెస్ కురువృద్ధుడు గా ఉండేవారు. కానీ ఆయన కుమారుడు వివేక్ తరచు పార్టీలు మారుతారన్న విమర్శ ఉంది. అయితే ఎందుకో తెలియదు కానీ వివేక్ తో తీవ్రంగా విభేదిస్తున్నారు దామోదర్ రాజనర్సింహ. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకరి కార్యక్రమానికి సైతం మరొకరు ముఖం చాటేస్తున్నారు.
ఆధిపత్యం కోసమే…
ఉమ్మడి మెదక్ జిల్లా పై ఆధిపత్యం కోసమే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొండా సురేఖ ఉన్నంతవరకు అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. గత ఏడాది జూన్లో వివేక్ ఇంచార్జ్ మంత్రి అయ్యారు. అప్పటినుంచి దామోదర్ రాజనర్సింహ ప్రతిపాదనలకు, సూచనలను పట్టించుకోవడంలేదని.. అందుకే మంత్రి వివేక్ పై దామోదర రాజనర్సింహ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఓ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దామోదర్ రాజనర్సింహ హాజరు కాలేదు. అక్కడ వివేక్ అన్ని తానై వ్యవహరించడం దామోదర రాజనర్సింహకు మింగుడు పడలేదు. క్షేత్రస్థాయిలో గట్టిపట్టున్న మున్సిపాలిటీ కావడం.. రాజనర్సింహ వెళ్లకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు అయింది. అయితే ఆ ఇద్దరు నేతలు అలానే కొనసాగితే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. దీనిపై హై కమాండ్ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి