హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు జూన్ నెలలో విస్తృత స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. ఈ చర్యల్లో భాగంగా 52 సైబర్ క్రైమ్ కేసులు (ఎఫ్‌ఐఆర్‌లు) నమోదు చేసి, ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 36 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, సోషల్ మీడియా మోసాలు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:జియో బంపర్ ఆఫర్: కేవలం రూ. 55లకే 1000కి పైగా లైవ్ టీవీ ఛానల్స్
దర్యాప్తులో భాగంగా వివిధ బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపజేయడంతో పాటు, మోసపోయిన బాధితులకు సుమారు రూ.49 లక్షలను తిరిగి అందజేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, బ్యాంకు చెక్‌బుక్లు, ఏటీఎం కార్డులు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడుల పేరుతో మోసాలు, ఇంట్లో నుంచే ఉద్యోగం లేదా పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో డబ్బులు వసూలు చేసే మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్, అలాగే మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్ల ద్వారా మోసాలు గణనీయంగా పెరిగాయి.
Also Read:ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఈ సందర్భంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. తెలియని వ్యక్తులు పంపే లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అధిక లాభాల హామీలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని, ఉద్యోగాల కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. అలాగే ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు