Homeఆంధ్ర ప్రదేశ్కడప వైసీపీలో కోల్డ్ వార్...!

కడప వైసీపీలో కోల్డ్ వార్…!

  • అవినాష్ రెడ్డి వర్సెస్ రవీంద్రనాథ్ రెడ్డి

  • మేనమామను సర్ది చెప్పలేకపోతున్న జగన్

  • రోజురోజుకు శృతిమిస్తున్న విభేదాలు

క్రైమ్ మిర్రర్, రాయలసీమ బ్యూరో: కడప జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయా? అవి తారా స్థాయికి చేరుకున్నాయా? జగన్ తీవ్ర ఆలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ విభేదాలతో జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్నారు. అందుకే ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మామ రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకుంటే ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారన్న భయం వెంటాడుతోంది. అన్నింటికీ మించి ఆయన తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిళ చెంతకు చేరితే తనకు ఇబ్బందులు వస్తాయని జగన్ తీవ్రంగా భయపడుతున్నట్లు సమాచారం.

కొత్తగా గ్రూపులు..
గత కొద్దిరోజులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపులు తయారయ్యాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డికి. మరోవైపు మంగళవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలోనే ఉండనున్నారు జగన్మోహన్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు అవినాష్ రెడ్డి వర్గం సిద్ధంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కక్కలేక మింగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అవినాష్ రెడ్డి తో పోల్చుకుంటే రవీంద్రనాథ్ రెడ్డి తోనే జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి. అలాగని ఆయనను వదులుకుంటే నేరుగా షర్మిల తో పాటు విజయమ్మ వద్దకు చేరుతారు. కుటుంబ అసమతి కూడా పెరగనుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

మేనమామకు జిల్లా బాధ్యతలు..
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. పది అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ. ఇటువంటి క్లిష్ట సమయంలో కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలను తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు జగన్. అయితే రవీంద్రనాథ్ రెడ్డి అందర్నీ కలుపు కెళ్లే మనస్తత్వం కాదు. ఇది పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెస్తోంది. ప్రధానంగా ఆయన కడప అసెంబ్లీ నియోజకవర్గం పై కన్నేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ సీటులో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ సీటు ఇచ్చేందుకు వీలుపడదని తేల్చి చెప్పారు. అయినా సరే అదేపనిగా కడప అసెంబ్లీ సీటు విషయంలో వేలు పెడుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. మరోవైపు అక్కడ వైసిపి నేతలుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు తో రవీంద్రనాథ్ రెడ్డికి పడడం లేదు. వారిద్దరూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తో సన్నిహితంగా ఉంటారు. అది ఎంత మాత్రం రవీంద్రనాథ్ రెడ్డికి రుచించడం లేదు.

ఎంపీ తో విభేదాలు..
గతంలో కమలాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు రవీంద్రనాథ్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.. ఆ నియోజకవర్గానికి చెందిన వైసిపి నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి ని కలుస్తుంటే రవీంద్రనాథ్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డితో తాడోపేడో అన్నట్టు రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. దానికి కారణం వైయస్సార్ కుటుంబ వ్యవహారం. తన సోదరి విజయమ్మతో పాటు మేనకోడలు షర్మిల పార్టీకి దూరంగా ఉండడానికి కారణం అవినాష్ రెడ్డి అంటూ బాహటంగానే విమర్శలు చేస్తున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి సైతం రవీంద్రనాథ్ రెడ్డి పై జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డికి మొగ్గు ఉంది కానీ.. ఆయనను వదులుకుంటే జరిగే పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇద్దరి మధ్య రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రవీంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. చూడాలి మున్ముందు పరిణామాలు ఎటు దారి తీస్తాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు