క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సినీ పరిశ్రమలో శాశ్వత శత్రుత్వాలు ఉండవనే మాటను మరోసారి నిజం చేస్తూ నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ ఒక్కటయ్యారు. గతంలో త్రివిక్రమ్‌పై తీవ్ర విమర్శలు చేసిన బండ్ల గణేష్.. ఇప్పుడు ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ఖాతాలో త్రివిక్రమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. థాంక్యూ గురూజీ.. మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, తర్వాత స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఎదిగారు. అయితే ఆయన సినిమాల కంటే ఎక్కువగా తన వ్యాఖ్యలు, ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో, ఎప్పుడు విమర్శిస్తారో చెప్పడం కష్టమనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో ఉంది. గతంలో పవన్ కళ్యాణ్‌కు తనను దూరం చేస్తున్న వ్యక్తిగా త్రివిక్రమ్‌ను పరోక్షంగా విమర్శించిన బండ్ల గణేష్, ఓ లీకైన ఆడియోలో దర్శకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఆయన, త్రివిక్రమ్‌కు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇద్దరూ బహిరంగంగా కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు త్రివిక్రమ్‌ను కలిసి, ఆయనపై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు విమర్శించిన వ్యక్తినే ఇప్పుడు గురూజీ అంటూ ప్రశంసించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బండ్ల గణేష్ మళ్లీ మెగా కుటుంబానికి దగ్గరైనట్లు కనిపిస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆయన సన్నిహితంగా కనిపించిన సందర్భాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో కూడా సంబంధాలు మెరుగుపడటం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మొత్తానికి ఒకప్పుడు విభేదాలతో వార్తల్లో నిలిచిన త్రివిక్రమ్ – బండ్ల గణేష్ ఇప్పుడు స్నేహపూర్వకంగా కలిసి కనిపించడం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఈ కొత్త స్నేహం భవిష్యత్తులో ఏవైనా సినిమా ప్రాజెక్టులకు దారితీస్తుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో కనిపిస్తోంది.