క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేనకు మరింత ప్రాధాన్యత పెరగనుందా.? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవునన్న సమాధానమే వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అంతా భావిస్తున్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తే రాష్ట్రంలోని కూటమి పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించేందుకు బిజెపి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజ్యసభకు ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుదకే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు సమాచారాన్ని బిజెపి అగ్ర నాయకులు అందించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఎదురు ఉండడం గమనార్హం. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రి కొనసాగుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన ఎంపీలు అత్యంత కీలకము కావడంతో ఈ రెండు పార్టీలకు చెందిన మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు అందించాలన్న యోచనలో బిజెపి అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
రేసులో ఎక్కువమంది.. అవకాశం ఇద్దరికీ..
కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో మరో ఇద్దరికి అవకాశం దక్కితే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఈ ప్రతిపాదనను కూడా కొంతమంది నాయకులు పెట్టినట్లు తెలుస్తోంది. వీరులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరితోపాటు తాజాగా రాజ్యసభకు ఎంపికైన జనసేనకు చెందిన లింగమనేని రమేష్, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లింగమనేని రమేష్ పట్ల ఇరు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
అనేక అంశాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం..
కేంద్రంలో రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరికి మంత్రి పదవులు అప్పగించే విషయంలో అనేక అంశాలను బిజెపి అగ్రనాయకత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాధాన్యత, రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ, మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం లింగంనేని రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మరి వీరిద్దరికీ అవకాశం దక్కుతుందో లేదో కొద్ది రోజుల్లోనే తేలనుంది.