IRS Officer Assault Case: సీబీఐకి చెందిన ఇద్దరు అధికారులపై నమోదైన పాత కేసులో తాజాగా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సోదాల సమయంలో ఒక ఐఆర్‌ఎస్ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలతో, ప్రస్తుత సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న రమనీష్ కు మూడు నెలల జైలు శిక్ష విధించబడింది. అలాగే మాజీ అధికారి వీకే పాండేకు కూడా ఇదే శిక్షను కోర్టు విధించింది. వీరిద్దరికీ రూ.50,000 చొప్పున జరిమానా కూడా విధించారు.
26 ఏళ్ల క్రితం కేసులో తీర్పు వెల్లడి
దాదాపు 26 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. 2000 అక్టోబర్ 19న, సీబీఐ అధికారులు సోదాల కోసం ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో నివసిస్తున్న ఐఆర్‌ఎస్ అధికారి అశోక్ కుమార్ అగర్వాల్ ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో వారు నిబంధనలు పాటించకుండా ఇంట్లోకి ప్రవేశించారని అగర్వాల్ ఆరోపించారు. అదేవిధంగా, అరెస్టు ప్రక్రియలో కూడా చట్టపరమైన విధానాలు పాటించలేదని, తనపై దాడి కూడా చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై విచారణ జరిపిన కోర్టు, ఫిర్యాదుదారుడి వాదనలను సమర్థిస్తూ సీబీఐ అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఈ కేసులో తీర్పుతో చట్టం ముందు అందరూ ఒకటేనని వెల్లడైందంటున్నారు న్యాయనిపుణులు.