మాదాపూర్ క్రైమ్ మిర్రర్: ఏప్రిల్ 19, 2026 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఘోర కారు ప్రమాదం నిందితుడిని పోలీసులు ఊటీ (Ooty) లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మితిమీరిన వేగంతో వచ్చిన ఒక మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) కారు, ఫోటోలు తీసుకుంటున్న దంపతులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో హాఫిజ్‌పేట్‌కు చెందిన గోసా శ్యామ్ రాజ్ (32) అనే వ్యాపారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతని భార్య కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోయిన డ్రైవర్‌ను టోలిచౌకికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహమ్మద్ అబ్దుల్ నవీద్ (44) గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన పై తాజా సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు తన కుటుంబంతో సహా నగరం విడిచి పారిపోయాడు. మైసూర్ మీదుగా ఊటీకి చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో దాక్కున్నాడు. దాదాపు వారం రోజుల పాటు పోలీసులు గాలింపు చేపట్టి, అతని భార్య కాల్ డేటా ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఊటీలో అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని ఆదివారం హైదరాబాద్‌కు తీసుకువచ్చి, పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.