HomeజాతీయంEggs Expiry Date: ఇక గుడ్లపైనా ఎక్స్‌ పైరీ డేట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Eggs Expiry Date: ఇక గుడ్లపైనా ఎక్స్‌ పైరీ డేట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వినియోగదారులకు గుడ్ల నాణ్యతపై స్పష్టత కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో విక్రయించే ప్రతి గుడ్డుపై ఉత్పత్తి తేదీ (Production Date), గడువు ముగిసే తేదీ (Expiry Date) తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఉత్తర ప్రదేశ్.

ఇకపై గుడ్లపై ఉత్పత్తి తేదీ!  

సాధారణంగా మార్కెట్లో విక్రయించే గుడ్లపై ఉత్పత్తి వివరాలు లేకపోవడంతో వినియోగదారులు అవి ఎంత తాజాగా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇకపై ప్యాక్ చేసిన మందుల బిళ్లల మాదిరిగానే గుడ్లపైనా స్పష్టమైన తేదీలు ఉండటంతో వినియోగదారులు సులభంగా వాటి తాజాదనాన్ని గుర్తించగలుగుతారు.

యూపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచే గుడ్లను అవి పెట్టిన తేదీ నుంచి రెండు వారాల లోపే వినియోగించడం మంచిదని సూచించారు. అయితే కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన గుడ్లను ఐదు వారాల వరకు ఉపయోగించవచ్చని తెలిపారు. ఈ ముద్రణ ప్రక్రియలో భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఫుడ్ గ్రేడ్ ఇంక్ మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుడ్లను ఏ పరిస్థితుల్లో నిల్వ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించేందుకు వేర్వేరు రంగుల సిరాలను ఉపయోగించాలని కూడా సూచించింది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసే గుడ్లపై గులాబీ రంగు సిరాతో తేదీలు ముద్రిస్తారు. కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచే గుడ్లపై నీలం రంగు సిరాను ఉపయోగిస్తారు.

తాజా గుడ్ల కొనుగోలు ఇకపై ఈజీ

ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు తాజా గుడ్లు కొనుగోలు చేయడం మరింత సులభం అవుతుంది. అలాగే మార్కెట్లో నాణ్యత లేని లేదా ఎక్కువకాలం నిల్వ ఉంచిన గుడ్ల విక్రయాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త నిర్ణయం గుడ్ల నాణ్యతపై పారదర్శకత పెంచడంతో పాటు వినియోగదారుల ఆరోగ్య రక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు