బెంగళూరులో ఓ వ్యాపారవేత్త మృతి ఘటన కలకలం రేపింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రముఖ నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బెంగళూరుకు చెందిన వైశాఖ్ అనే వ్యాపారవేత్త కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కుటుంబ సమస్యలు, ముఖ్యంగా భార్యతో విభేదాల కారణంగా అతడు కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. గత వారం రోజులుగా అతడు బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో ఉన్న నటి క్రిషి తపండ ఇంట్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి వైశాఖ్ చనిపోయి కనిపించాడు. ఆ సమయంలో నటి ఇంట్లో లేరని, ఆమె మరో ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో వైశాఖ్ కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కూడా అతడిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై వైశాఖ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఫిర్యాదు అందిన తర్వాత రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నారు. పోస్టుమార్టం, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో వైశాఖ్ పై కేసు
కాగా, ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డిని బెదిరించిన కేసులో వైశాఖ్ గతంలో అరెస్టయ్యాడు. ఆ కేసులో పోలీసులు కొద్ది రోజుల పాటు అతడిని విచారించారు. అనంతరం ఆ కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.