Homeక్రైమ్మైనర్ బాలిక దారుణ హత్య.. తల నరికి అడవిలో పడేసిన ప్రియుడు

మైనర్ బాలిక దారుణ హత్య.. తల నరికి అడవిలో పడేసిన ప్రియుడు

క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో అత్యంత భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన బాలికను ఓ యువకుడు దారుణంగా హత్య చేసి, శరీరం నుంచి తలను వేరు చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సెప్టెంబర్ 30న చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అడవిలోకి తీసుకెళ్లి దారుణం
పోలీసుల కథనం ప్రకారం.. జామోనియా గణేష్ గ్రామానికి చెందిన అంకిత్ మాల్వియా అనే యువకుడితో 17 ఏళ్ల మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమలో ఉంది. సెప్టెంబర్ 30న ఆ బాలిక కరేడి ప్రాంతం నుంచి ప్రియుడిని కలవడానికి రాజ్‌గఢ్ వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి బయోరా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అంకిత్, బాలికను హత్య చేయడమే కాకుండా రంపంతో ఆమె తలను నరికి వేరు చేశాడు.
అదే రోజు ప్రమాదంలో నిందితుడి మృతి
హత్య అనంతరం ఈ విషయాన్ని అంకిత్ ఫోన్ చేసి తన బంధువుకు తెలిపాడు. ఆ తర్వాత వేగంగా బైక్‌పై తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాల్ డేటాతో బయటపడ్డ నిజాలు
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాలికకు అంకిత్‌తో సంబంధం ఉన్నట్లు గుర్తించినప్పటికీ, అతడు ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో అంకిత్ ఫోన్ కాల్ డేటాను (CDR) పరిశీలించగా.. సంఘటన జరిగిన రోజు అతడు తన బంధువుతో అనేకసార్లు మాట్లాడినట్లు తేలింది.
వెంటనే ఆ బంధువును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, బాలిక హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అంకిత్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అటవీ ప్రాంతంలో గాలించగా, బాలిక మృతదేహం లభ్యమైంది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో రోజులు గడిచి మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయింది. మొండెం లభించిన ప్రదేశానికి కొంత దూరంలో పుర్రె లభించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి మధ్య అసలు ఏ విషయంలో గొడవ జరిగింది? హత్యకు గల బలమైన కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: గుడ్‌న్యూస్: తెలంగాణ ఉద్యోగుల ఖాతాల్లో డీఏ డబ్బులు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు