క్రైమ్ మిర్రర్ : పంజాబ్‌లో రాజకీయ కక్షలు మరోసారి హింసకు దారితీశాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ నేతను దుండగులు తుపాకులతో కాల్చి హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న ఆయనను కారులో వచ్చిన వ్యక్తులు వెంబడించి మరీ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం మమ్‌దోత్ టౌన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుర్‌ప్రీత్ గోపి తన స్నేహితుడు హర్‌ప్రీత్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు. వారి వెనుక మరో కారులో కొందరు స్నేహితులు వస్తున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారులో వచ్చిన దుండగులు బైక్‌ను వెంబడించడం ప్రారంభించారు. అనంతరం గుర్‌ప్రీత్, హర్‌ప్రీత్‌పై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో గుర్‌ప్రీత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ను అనుసరిస్తూ కారులో వస్తున్న ఆయన స్నేహితులపైనా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
రాజకీయ కక్షలే కారణమా?
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో రాజకీయ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తికి గతంలోనూ నేరచరిత్ర ఉందని ఎస్ఎస్‌పీ భూపీందర్ సింగ్ తెలిపారు. అతడు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితులను పోలీసులు గుర్తించినట్లు ఎస్ఎస్‌పీ తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
also read : కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. “చేతులు నరికేస్తా” అంటూ వార్నింగ్!
