‘బలగం’ సినిమాతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అనంతిక సనిల్‌కుమార్.. ‘ఎల్లమ్మ’లో కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. ఎల్లమ్మ దేవిని ఆరాధిస్తూ కళను నమ్ముకుని జీవించే ఓ కళాకారుల బృందం చుట్టూ కథ సాగుతుందని టాక్.
జీవనోపాధి కోసం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వ్యక్తిగత సంఘర్షణలు, భావోద్వేగాలు కథలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం, బలమైన భావోద్వేగాలను సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు వేణు యెల్దండి ప్రయత్నిస్తున్నారని సమాచారం.
‘బలగం’లో తెలంగాణ పల్లె జీవితాన్ని, కుటుంబ బంధాలను హృద్యంగా చూపించిన వేణు.. ‘ఎల్లమ్మ’లోనూ నేటివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతిక పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఆసక్తి నెలకొంది. హీరోయిన్‌గా అనంతిక ఎంపికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: టాలీవుడ్‌కు తాప్సీ రీఎంట్రీ.. మేర్లపాక గాంధీతో హారర్ థ్రిల్లర్?
