-
హైకోర్టు కీలక ఆదేశాలు
-
వార్డుల డీ లిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ సూచన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని అర్థం అవుతోంది. ఎన్నికల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు నీళ్లు చల్లింది.
జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా తిరిగి నిర్ధారించే వరకు ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వద్దని ఆదేశించింది. ఈ పరిణామంతో జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ పై అయోమయం నెలకొంది.
-
నిబంధనలకు విరుద్ధం అంటూ..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసి వార్డుల పునర్విభజన జరిపింది. అయితే ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిపారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. 1996 జీవో నెంబర్ 570 లోని రూల్ 5 ప్రకారం జనాభా ప్రాతిపదికనే వార్డుల డీలిమిటేషన్ జరగాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలను పాటించలేదని పిటిషనర్లు వాదించారు.
తెలంగాణ మున్సిపాలిటీ 2019లోని సెక్షన్ 6 ప్రకారం ప్రజల అభ్యంతరాలు స్వీకరించి.. పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా.. నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రాథమికంగా పిటిషన్ లో ఉన్న అంశాలను పరిశీలించింది.
తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా పునర్నిర్ణయించాలని.. అప్పటివరకు జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
-
రాజకీయ పార్టీలు సిద్ధం..
అయితే ఇప్పటికే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కోర్టు ఆదేశాల ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డీ లిమిటేషన్ ప్రక్రియను ఎలా సమర్థించుకుంటుంది.. తదుపరి విచారణలో ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుంది అనే అంశాలపై ఎన్నికల భవిష్యత్తు ఆధారపడనుంది.
హైకోర్టు తుది తీర్పు వచ్చేవరకు జీహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇంకో వైపు చూస్తే ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మేయర్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాల్లో ఉంది. భారత రాష్ట్ర సమితి తో పాటు భారతీయ జనతా పార్టీ సైతం వ్యూహాలు సిద్ధం చేశాయి. కానీ కోర్టు వారి ఆశలపై నీళ్లు చల్లింది.