Homeతెలంగాణవరంగల్‌ విమానాశ్రయానికి రూ.497 కోట్లు...?

వరంగల్‌ విమానాశ్రయానికి రూ.497 కోట్లు…?

వరంగల్, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణలోని వరంగల్ మామ్నూర్ విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరు ఎయిర్‌పోర్టును రూ.496.86 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రన్‌వే, అప్రాన్, ట్యాక్సీవే మరియు బౌండరీ వాల్ నిర్మాణం వంటి మౌలిక వసతుల పనుల కోసం ప్రాథమిక టెండర్లను కూడా ఏఏఐ విడుదల చేసింది. మామ్నూర్ విమానాశ్రయ నిర్మాణ పనులు భూసేకరణ, అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే వేగవంతం కానున్నాయి. మామునూరు ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యే సమయం పూర్తిగా భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.

Also Read:విజయవాడలో జిమ్ ట్రైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు – పరస్పర ఆరోపణలతో కేసు సంచలనం

వరంగల్‌ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.496.86 కోట్ల అంచనాతో అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే సమయం అనేది భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉడాన్‌ స్కీమ్‌ కింద తెలంగాణ నుంచి ఇప్పటివరకు 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనాన్ని ఏఏఐ ఇప్పటికే పూర్తి చేసి, అక్కడ అవసరమయ్యే భూమి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించారు.. ఆదిలాబాద్‌ ఎయిర్ పోర్ట్ ఉమ్మడిగా ఉపయోగించుకోవడానికి ఉన్న అవకాశాలపై ఏఏఐ అధ్యయనం చేసి, అవసరమైన భూమి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు మంత్రి తెలిపారు.

Also Read:నియంత్రణ, బాధ్యత లోపిస్తే కేరీర్ క్ష‌ణాల్లో మాయం….! ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతమే ఒక పాఠం….

పెద్దపల్లిలో ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను ఫిబ్రవరిలోనే సమర్పించినట్లు చెప్పారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెంలోని రామవరం, చెంచుపల్లి, సుజాతనగర్‌ పరిధిలోని స్థలాల్లో ఏఏఐ విచారణ జరపగా, అక్కడ ఉన్న కొండలు, రైల్వే లైన్ల కారణంగా విమానాశ్రయ నిర్మాణం సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు వివరించారు.తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైలు ప్రాజెక్టులకూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఫస్ట్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద కేంద్ర ఆర్థిక శాఖ రూ.1,204 కోట్లు విడుదల చేసింద్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలాంటి మెట్రో ప్రాజెక్టూ అమల్లో లేదని స్పష్టం చేశారు.

తాజావార్తలు