•కాంచీపురం లో అదుపులో తీసుకున్న తెలంగాణ పోలీసులు
•హైదరాబాదులో రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో భూ కుంభకోణానికి సంబంధించిన నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడు గత కొద్దిరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం అన్వేషణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు కాంచీపురంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో తమిళనాడుకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో ఆయన అరెస్టు జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదో షాకింగ్ పరిణామమే.
అడ్డగోలుగా దోపిడీకి..
హైదరాబాద్ శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట పరిధిలో.. ఏకంగా 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కాజేసేందుకు భారీగా కుట్రపన్నారు, నకిలీ దస్తావేజులు, తప్పుడు రికార్డులను సృష్టించి.. నకిలీ జీవోలను సర్కులేట్ చేసి దాదాపు రూ.1500 కోట్ల భారీ విలువైన భూమిని అక్రమంగా తన ల్యాండ్ బ్యాంకులోకి బదలాయించుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం బయటకు రావడంతో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక నిర్ధారణలోనే ఆయన తప్పు చేసినట్లు తేల్చారు. అయితే మొత్తం ఎపిసోడ్లో బొల్లా బ్రహ్మనాయుడు పై భూకబ్జా ఆరోపణలు పోలీస్ వర్గాలే విస్తు పోయేలా ఉండడం గమనార్హం.
ప్రభుత్వ ఉత్తర్వులు సైతం నకిలీ..
అయితే ఈ మొత్తం కబ్జా వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీగా సృష్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సంతకాలను, సీళ్ళను ఫోర్జరీ చేసి సదరు స్థలం ప్రభుత్వానిది కాదు.. ప్రైవేటు వ్యక్తుల దంటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను చేతులు మార్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో.. ఇదో పెద్ద స్కెచ్ గా తేలింది. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాంచీపురం లో అరెస్టు చేసిన బ్రహ్మనాయుడును పోలీసులు భారీ భద్రత నడుమ హైదరాబాద్ కు తరలించారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ కీలకన్యతగా ఉన్న బ్రహ్మనాయుడు అరెస్టు కావడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.