* నితీన్ నబీన్ సమక్షంలో కమలం పార్టీలో చేరిక
* మరో నలుగురూ వీడుతున్నారన్న రాఘవ్ చద్దా
* రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమైనట్లు ప్రకటన
* పంజాబ్ లో పాగా వేసేందుకు కమలం వ్యూహం
దేశ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంలోని అధికార బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు గాలం వేసింది. కేజ్రీవాల్ పట్ల అసంతృప్తితో ఉన్న రాఘవ్ చద్దా సహా అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ ముగ్గురూ బీజేపీలో చేరారు. మరో నలుగురు రాజ్యసభ సభ్యులు హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతి మలివాల్, విక్రమ్ సింగ్ సాహ్ని కూడా అదే బాటలో ఉన్నారు. స్వాతి మలివాల్ ఇప్పటికే తాను ఆప్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. రాఘవ్ చద్దా శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ను కలిసి ఆ పార్టీలో చేశారు. ఆప్ కు మొత్తం పది మంది రాజ్యసభ ఎంపీలున్నట్లు, వీరిలో ఏడుగురం పార్టీని వీడినందున తమ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆప్ కు మరో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు.
రాఘవ్ చద్దా సహా ఆప్ ఎంపీలు పార్టీని వీడటంపై ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ ప్రజలకు బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినప్పటికీ.. ఆప్ ఎప్పుడూ ఐక్యంగానే ఉంటుందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. ఆప్ మరో ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘రాఘవ్ చద్దాకు పార్టీ అన్నీ ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేను చేసింది. సందీప్ పాఠక్‌ను పంజాబ్ ప్రజలు ప్రేమతో రాజ్యసభకు పంపారు. దిగువస్థాయి నుంచి వచ్చిన రాజేంద్ర గుప్తా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, విక్రమ్ సాహ్నీలకు పంజాబ్ ప్రజలు, పార్టీ ఉన్నత అవకాశాలు కల్పించింది. ప్రజల ఆశీస్సుల వల్లే హర్భజన్ సింగ్‌కు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. కానీ, ఈ ఏడుగురూ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’’ అని మండిపడ్డారు. బీజేపీ.. ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని, తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను ప్రలోభపెట్టడానికి ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుందని ఆరోపించారు. మరోవైపు ముగ్గరు ఎంపీలు బీజేపీలో చేరడంపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆప్ సిద్ధమైంది.
పంజాబ్ లక్ష్యంగా ఆపరేషన్..
బీజేపీ ఇంత అకస్మాత్తుగా ‘ఆపరేషన్ లోటస్’ చేపట్టడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు రాఘవ్ చద్దాను, ఇతర రాజ్యసభ సభ్యులను ఆయుధాలుగా మలచుకోనున్నారు. ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ లో బీజేపీకి అసలు ఏమాత్రం బలం లేదు. దశాబ్దాలుగా శిరోమణి అకాలీదళ్ తో పొత్తుతో పంజాబ్ లో బీజేపీ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు స్వతంత్రంగా ఎదగాలని యోచిస్తోంది. అందుకోసమే ఆప్ నేతలను తమ పార్టీలో చేర్చుకొని, వారి ద్వారా రాష్ట్రంలో బలపడాలని భావిస్తోంది.