Bhu Bharathi: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ ఒక్కసారిగా నిలిచిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన భూభారతి పోర్టల్ సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచే పోర్టల్ సర్వర్ స్పందించకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్థంభించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సర్వర్లు పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వల్ల ప్రజలు నిరాశ చెందుతున్నారు. ముందుగా స్లాట్లు బుక్ చేసుకుని వచ్చిన వారు కూడా పనులు పూర్తి చేసుకోలేక వెనుదిరుగుతున్నారు. దీంతో రోజువారీ ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు, సర్వర్లపై అధిక ఒత్తిడి పడటమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సాంకేతిక లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే పనులు ప్రారంభించాయని, త్వరలోనే సేవలు పునరుద్ధరించబడతాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా యూజర్ చార్జీల పెంపు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రభుత్వం ఇటీవలే భూభారతి పోర్టల్లో వినియోగదారుల ఛార్జీలను పెంచింది. అయితే ఈ పెంపు అమల్లోకి రాకముందే కొందరు స్లాట్లు బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రావడంతో పాత రేట్లపై బుకింగ్ చేసుకున్న వారికీ ఇప్పుడు పెరిగిన చార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన రుసుములు చెల్లించినప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం.
మొత్తానికి సాంకేతిక సమస్యలతో పాటు చార్జీల పెంపు కలిసివచ్చి ప్రజలకు ఇబ్బందులు పెంచుతున్నాయి. త్వరగా సమస్యలను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి సారించి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ASLO READ: బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?