భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలో సాయిబాబా ఆలయం సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనం కోసం బయలుదేరిన కుటుంబం గమ్యస్థానానికి చేరకముందే ఈ ప్రమాదం జరగడం మరింత బాధాకరం.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అనురాగ్ కుటుంబ సభ్యులు ఇటీవల విశాఖపట్నం నుంచి ఖమ్మం జిల్లా మధిరలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి చిన్నారి ఆయిద్య, ఆమె తల్లి హాద్య, అమ్మమ్మ పద్మావతి, తాతయ్య కృష్ణకేశవ్ కలిసి భద్రాచలం యాత్రకు బయలుదేరారు.
మధ్యలో పాల్వంచ సమీపంలో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఒక్క క్షణంలో జరిగిన ఈ ప్రమాదం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆనందంగా సాగాల్సిన యాత్ర ఒక్కసారిగా శోకయాత్రగా మారిపోవడంతో బంధువులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మధిర పట్టణానికి చెందిన కుటుంబానికి ఈ విషాదం కలగడంతో ప్రాంతంలో తీవ్ర శోక వాతావరణం నెలకొంది. చిన్నారి మృతి వార్త తెలిసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ALSO READ: అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!