భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం సరిహద్దు భద్రతను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ముళ్ల కంచె నిర్మాణం చేపట్టేందుకు బీఎస్ఎఫ్ కు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కంచె నిర్మాణంపై స్పందించిన బంగ్లా
కంచె నిర్మాణ పనులపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు M. H. కబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ముళ్ల కంచెలకు ఢాకా భయపడదని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన హామీలను తాము గమనిస్తున్నామని చెప్పారు. అయితే భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో తమ దేశ జాతీయ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని కబీర్ వెల్లడించారు. భారత్ తో తమ సంబంధాలు నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సంబంధాలు ఉండవని తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో రెండు దేశాల నాయకత్వం ముందుకు సాగుతోందన్నారు.
45 రోజుల్లో కంచె నిర్మాణం పూర్తి చేస్తామని హమీ
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో సరిహద్దు భద్రత ప్రధాన అంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం పూర్తి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి తన తొలి మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని బీఎస్‌ఎఫ్‌కు కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కంచె నిర్మాణం ద్వారా అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ వంటి సమస్యలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.