వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై మరోసారి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకాలో జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 86 పరుగుల తేడాతో గెలిచింది.
8 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసిన బంగ్లా
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించిన మోసాడెక్ హోస్సేన్ అజేయంగా 86 పరుగులు చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో 67 పరుగులు, తంజిద్ హసన్ 54 పరుగులతో రాణించారు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్‌లతో బంగ్లాదేశ్ పోటీ స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా, లియామ్ స్కాట్, మ్యాట్ రేన్‌షా చెరో రెండు వికెట్లు సాధించారు. గ్జేవియర్ బార్ట్ లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. బంగ్లాదేశ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కంగారూ జట్టును కట్టడి చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ అజేయంగా 52 పరుగులు చేసి పోరాడగా, అలెక్స్ క్యారీ 47 పరుగులు, కూపర్ కానోలీ 35 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో నహిద్ రాణా నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మోసాడెక్ హోస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించగా, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు రెండో విజయం
వర్షం కొనసాగడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాలేదు. దీంతో డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం బంగ్లాదేశ్ విజేతగా ప్రకటించారు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు ఇది రెండో విజయం మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి కంగారూ జట్టును ఓడించిన బంగ్లాదేశ్, ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత మరో చారిత్రాత్మక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.