గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. ముఖ్యనేతల తీరుతో కేడర్ లో గందరగోళం నెలకొంటుంది. నియోజకవర్గంలో వెలుస్తున్న పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు చూస్తే.. అసలు కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎవరనే చర్చ ప్రజల్లో సాగుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు బండి రమేశ్. ఆయన ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ గా ఉన్నారు. గత రెండున్నర ఏళ్లుగా కూకట్ పల్లి నియోజకవర్ కాంగ్రెస్ లో ఏ నిర్ణయమన్న బండి రమేశ్ డైరెక్షన్ లోనే సాగుతోంది. ఇటీవల నియమించిన డివిజన్ అధ్యక్షుల నియామకం కూడా పూర్తిగా బండి రమేశ్ కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా మాత్రం సీన్ మరోలా కనిపిస్తోంది. బండి రమేశ్ కు పోటీగా దూకుడు పెంచారు సత్యం శ్రీరంగం.సత్యం శ్రీరంగం ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో ఆయనకు ప్రత్యేక అనుచరగణం ఉంది. డివిజన్ అధ్యక్షుల నియామకం తర్వాత సత్యం తన స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది.
కొంత కాలం బండి రమేశ్ కు సన్నిహితంగా మెలిగిన సత్యం శ్రీరంగం.. ఇప్పుడు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సత్యం శ్రీరంగం అనుచరులు వేసిన ఫ్లెక్సీలు… కట్టిన బ్యానర్లు ఇప్పుడు కూకట్ పల్లి కాంగ్రెస్ లో రచ్చ రాజేస్తున్నాయి. గాయత్రినగర్ డివిజన్ పర్వత్ నగర్ లో సుంకన్న వేసిన బ్యానర్ లో సత్యం శ్రీరంగంను కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జీగా హైలెట్ చేశారు. సత్యం శ్రీరంగం డైరెక్షన్ లోనే సుంకన్న ఇలా బ్యానర్ వేశారనే చర్చ సాగుతోంది. బండి రమేశ్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్న సుంకన్న.. కావాలనే రెచ్చగొట్టేలా పోస్టర్లు వేశారనే టాక్ కూడా వస్తోంది.
బండి రమేశ్ ఉండగా సత్యం శ్రీరంగంను కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ పోస్టర్లు వేయడంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. 2023లో బండి రమేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు సత్యం శ్రీరంగం. ఆ పదవి ఇప్పటికి తనకే ఉందని.. కొత్తగా నియోజకవర్గ ఇంచార్జీగా పార్టీ అధికారికంగా ఎవరిని ప్రకటించలేదని సత్యం శ్రీరంగం అనుచరులు చెబుతున్నారు. పీసీసీ నుంచి ఎలాంటి నియామకం జరగలేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా కేవలం పీసీసీ అధికార ప్రతినిధిగానే తన పోస్టర్లు, బ్యానర్లు వేయించుకున్న సత్యం శ్రీరంగం.. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ ఇంచార్జీ పేరుతో ఎందుకు వేయించుకుంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. డివిజన్ అధ్యక్షుల నియామకంలో తన వర్గానికి ప్రాధాన్యత దక్కలేదనే కోపంతోనే.. బండి రమేశ్ కు పోటీగా సత్యం శ్రీరంగంకొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు సత్యం శ్రీరంగంను కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జీగా పేర్కొంటూ ఫ్లెక్సీలు కట్టడంపై బండి రమేశ్ టీం భగ్గుమంటోంది. అసెంబ్లీలో పోటీ చేసిన అభ్యర్థే ఇంచార్జ్ గా ఉంటారని.. చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫ్లెక్సీల గోల ఎలా ఉన్నా .. ఇద్దరు నేతల పోటాపోటీ కార్యక్రమాలతో కాంగ్రెస్ కేడర్ మాత్రం అయోమయంలో పడుతున్నట్లు తెలుస్తోంది.
