Homeక్రైమ్బండి భగీరథ్ పోక్సో కేసు...పోలీస్ కస్టడీపై మే 26న కోర్టు కీలక తీర్పు...!

బండి భగీరథ్ పోక్సో కేసు…పోలీస్ కస్టడీపై మే 26న కోర్టు కీలక తీర్పు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అయితే తుది నిర్ణయాన్ని కోర్టు మే 26కు వాయిదా వేయడంతో ఈ కేసుపై ఉత్కంఠ మరింత పెరిగింది.

ఈ కేసులో భగీరథ్‌ను మూడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని, భగీరథ్‌ను ప్రశ్నించడం అవసరమని తమ వాదనలో పేర్కొన్నారు. మరోవైపు భగీరథ్ తరఫు న్యాయవాది కరుణ సాగర్ మాత్రం పోలీసుల విజ్ఞప్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. కస్టడీ ఇవ్వకూడదని కోర్టును కోరుతూ.. ఒకవేళ అనుమతి ఇచ్చినా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని వాదించారు.

విచారణ సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆయన కోర్టుకు తెలిపారు. అలాగే థర్డ్ డిగ్రీ పద్ధతులు లేదా బలవంతపు చర్యలు చేపట్టకూడదని కూడా విజ్ఞప్తి చేశారు.ఈ కేసు మే 8న నమోదైంది. ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై బీఎన్‌ఎస్‌, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి.. తర్వాత భగీరథ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

అయితే ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. భగీరథ్ కూడా బాలిక కుటుంబంపై ఎదురు ఫిర్యాదు చేశారు. తమపై ఒత్తిడి తెచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించారని, డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి మే 26పై పడింది. కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తుందా? లేక షరతులతో కూడిన నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు