ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు భారీ శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్‌ఎస్‌ఎస్‌బీ తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1979 పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలవనుంది. ఇందులో అత్యధికంగా 675 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ పోస్టులు ఉండటం విశేషం. కంప్యూటర్ సైన్స్ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు బీఎడ్ అర్హత లేకుండానే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం మరో ప్రత్యేకతగా మారింది.
సాధారణంగా ఉపాధ్యాయ పోస్టులకు డీఎడ్ లేదా బీఎడ్ అర్హత తప్పనిసరిగా ఉంటుంది. అయితే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు మాత్రం ఈ నిబంధనలో మినహాయింపు కల్పించారు. బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ లేదా సమాచార సాంకేతిక విభాగంలో విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులుగా పరిగణించబడతారు. అలాగే కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇతర డిగ్రీ పూర్తి చేసి, నీలిట్ నుంచి ఏ లెవెల్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44900 నుంచి రూ.142400 వరకు వేతనం లభించనుంది.
ఈ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయ పోస్టులతో పాటు పలు ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ విభాగంలో 450 పోస్టులు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 163 పోస్టులు, డొమెస్టిక్ సైన్స్ టీచర్ విభాగంలో 129 పోస్టులు భర్తీ చేయనున్నారు. అదనంగా ఐటీ అసిస్టెంట్ గ్రేడ్-ఏ పోస్టులు 125 ఉండగా, ఫోరెన్సిక్ మరియు శాస్త్రీయ విభాగాలకు సంబంధించిన పలు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బాలిస్టిక్స్‌లో 18 పోస్టులు, ఫిజిక్స్‌లో 16 పోస్టులు, బయాలజీలో 44 పోస్టులు, కెమిస్ట్రీలో 37 పోస్టులు, సైబర్ ఫోరెన్సిక్ విభాగంలో 81 పోస్టులు, క్రైమ్ సీన్ మరియు డిస్ట్రిక్ట్ మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ విభాగంలో 46 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
పోస్టును బట్టి విద్యార్హతలు భిన్నంగా ఉన్నాయి. డీఎడ్, బీఎడ్, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన అర్హతలు, డిప్లొమా, పీజీ డిప్లొమా, డొమెస్టిక్ సైన్స్ లేదా హోమ్ సైన్స్‌లో డిగ్రీ, ఫోరెన్సిక్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ తదితర విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ అర్హతలు అవసరం అవుతాయి. కొన్ని పోస్టులకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత కూడా తప్పనిసరి. అలాగే కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉండాలి.
వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు సడలింపు కల్పించనున్నారు. మాజీ సైనికోద్యోగులకు కూడా నిబంధనల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 15, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా సాధారణ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.25500 నుంచి రూ.142400 వరకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటంతో దేశవ్యాప్తంగా ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: పండుగే పండగ.. ఒకే రోజు 7 మ్యాచులు