Homeతెలంగాణఈ నెల 21 నుంచి మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటన...

ఈ నెల 21 నుంచి మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటన…

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయి బలోపేతంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మీనాక్షి నటరాజన్, పార్టీ కార్యక్రమాల పురోగతి, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమాలపై పార్టీ చేపడుతున్న కార్యాచరణలో భాగంగా బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కోసం నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఓటరు జాబితాల పరిశీలన, ఎన్నికల నిర్వహణలో బీఎల్‌ఏల పాత్ర, బూత్ స్థాయి వ్యూహాలపై పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

పర్యటనల షెడ్యూల్ ప్రకారం జూన్ 21న మక్తల్ నియోజకవర్గంలో, జూన్ 23న ఆందోల్ నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో టీపీసీసీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొని పార్టీ కార్యకర్తలకు సూచనలు చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం లక్ష్యంగా ఈ పర్యటనలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా, ఈ సమావేశాలు పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని నాయకులు భావిస్తున్నారు. మీనాక్షిపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక పరిధి తమకు లేదని స్పష్టం చేస్తూ, సదరు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు పిటిషనర్‌కు వాపస్ చేయడం లీగల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు