దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘Okuu’ అనే ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ బ్రాండ్‌ను ప్రారంభిస్తూ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ, ఈ బ్రాండ్ వెనుక ఐదేళ్ల కృషి ఉందని తెలిపారు. నాణ్యమైన పోషకాహార ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో విస్తృతంగా పరిశోధనలు చేసి, ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నానని వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించడం తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు మార్కెట్లో అనేక న్యూట్రిషన్ బ్రాండ్లకు సినీ ప్రముఖులు కేవలం ప్రచారకర్తలుగా మాత్రమే ఉంటారని, కానీ తాను స్థాపించిన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వంగా ఉందని సాక్షి అన్నారు. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి.. రాజా రాణి, కాలా, విశ్వాసం, సిండ్రెల్లా, టెడ్డీ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అలాగే బిగ్ బాస్ తమిళ్ ద్వారా మరింత ప్రజాదరణ సాధించారు.
ఇప్పుడు నటిగా కొనసాగుతూ వ్యాపారవేత్తగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త ప్రయాణంలో సాక్షి విజయవంతం కావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు.
also read: అమెరికాలో విషాదం.. గృహప్రవేశ వేడుకనాడే తెలుగు యువకుడి మృతి