Homeక్రైమ్లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో ఏసీబీ నిఘాలోకి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఆస్తుల గుట్టు రట్టు

లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో ఏసీబీ నిఘాలోకి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఆస్తుల గుట్టు రట్టు

హైదరాబాద్‌లోని నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన ఖరీదైన జీవనశైలే ఏసీబీ అధికారుల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. తరచూ కొత్త లగ్జరీ కార్లలో ఆసుపత్రికి రావడం, విదేశీ పర్యటనలు చేయడం, ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో గడపడం వంటి అంశాలపై అధికారులు కొంతకాలంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి జీవనశైలికి, అధికారిక ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న అనుమానంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భారీగా ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఏసీబీ లెక్కల ప్రకారం.. 2007 నుంచి ఇప్పటివరకు లక్ష్మీ భాస్కర్‌కు సుమారు రూ.2 కోట్ల మేర అధికారిక ఆదాయం ఉన్నట్లు గుర్తించారు. ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆయన వద్ద సుమారు రూ.1.05 కోట్ల వరకు మిగులు ఉండాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే సోదాల సమయంలో సుమారు రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీటి మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గతంలోనూ ఆరోపణలు

లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి ఆరోపణలు గతంలోనూ వచ్చినట్లు సమాచారం. నిమ్స్‌లో వైద్యుడిగా పనిచేసిన సమయంలో ఓ రోగి నుంచి డబ్బులు తీసుకుంటున్న సందర్భంలో అప్పటి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు పట్టుబడ్డారని, ఆ ఘటన తర్వాత ఆయన ఉద్యోగం కోల్పోయారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ తర్వాత రాజకీయ పలుకుబడితో తిరిగి నిమ్స్‌లోకి వచ్చిన ఆయన కీలక పరిపాలనా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఈ సమయంలో తనకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

సహకరించిన వారిపైనా ఏసీబీ దృష్టి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లక్ష్మీ భాస్కర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు ఆయన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఆయనతో సంబంధాలు ఉన్న ఉద్యోగులు, మధ్యవర్తులు, బినామీల పాత్రపైనా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆస్తులు ఎలా సమకూరాయి? వాటి కొనుగోళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యవహారంలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: ఒకప్పుడు హీరో భార్యకు నచ్చలేదని నన్ను సినిమా నుంచి తొలగించారు- తాప్సీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు