హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు బెంగాల్‌లోని బర్ధమాన్ ప్రాంతం నుంచి సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
దేవోస్మితా పాల్ ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఆస్తి వివాదమే ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. దేవోస్మితా పాల్ తాతకు చెందిన ఆస్తిపై కన్నేసిన నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దేవోస్మితా పాల్‌కు బెంగాల్‌లో వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా ఆ ఇంట్లో స్థానిక దంపతులు అద్దెకు ఉంటున్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి అద్దెకు ఉంటున్న వారు ప్రయత్నిస్తున్నట్టు దేవోస్మిత గుర్తించారు. ఇల్లు ఖాళీ చేయాలని కొంతకాలంగా వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాగైనా ఆ ఇంటిని దక్కించుకోవాలనే కోరికతో ఆ దంపతులు దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం దేవోస్మిత ఉంటున్న అపార్ట్‌మెంట్ దగ్గరకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తమ పాపను కూడా తీసుకెళ్లారు.
దేవోస్మిత ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే తమతో తెచ్చుకున్న ఆయుధంతో దాడి చేశారు. దేవోస్మితను హత్య చేసి, అరగంట పాటు అక్కడే ఉండి, బట్టలు మార్చుకుని బయటకు వచ్చి క్యాబ్‌లో వెళ్లిపోయారు. పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్‌ను విచారించగా ఆ దంపతులు బెంగాల్ వారని తెలిసింది. దీంతో పోలీసులు నిందితులను కనిపెట్టగలిగారు. బెంగాల్‌లోని బర్ధమాన్‌లో నిందితులను అరెస్ట్ చేశారు