ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని, బరువు తగ్గించే పేరుతో ప్రమాదకరమైన ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఈ అక్రమ దందాను గుర్తించి కీలక వివరాలు వెల్లడించారు.
పోలీసుల విచారణలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ ఇంజెక్షన్ల విక్రయాలు సాగిస్తున్నట్లు తేలింది. అమెరికాలో ఇంకా ప్రయోగాత్మక పరిశోధన దశలో ఉన్న కొన్ని ఇంజెక్షన్లను ‘రీసెర్చ్ పెప్టైడ్స్’ పేరుతో ఆన్లైన్లో ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు కొరియర్ సర్వీసుల ద్వారా ఈ ఇంజెక్షన్లను సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, వీటి విక్రయాలకు, వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతులు లేవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాత్మక ఇంజెక్షన్లను ఉపయోగించడం ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారనే ఆశతో సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మి ఇలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అనుమతి లేని మందులు, ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలని, బరువు తగ్గేందుకు వైద్యుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని హెచ్చరించారు.
also read: గచ్చిబౌలి మెన్స్ పీజీలో డ్రగ్స్ కలకలం.. 8 మందికి పరీక్షలు, ఆరుగురికి గంజాయి పాజిటివ్!
