Homeఆంధ్ర ప్రదేశ్రాజమండ్రి పీఠం ఎవరిది...?హోరాహోరీగా కార్పొరేషన్ పోరు

రాజమండ్రి పీఠం ఎవరిది…?హోరాహోరీగా కార్పొరేషన్ పోరు

  • మేయర్ స్థానానికి బహుముఖ పోటీ

  • కూటమి తరుపున బరిలో బిజెపి అభ్యర్థి

  • కూటమి వైపే స్పష్టమైన మొగ్గు

  • క్రైమ్ మిర్రర్ గ్రౌండ్ రిపోర్ట్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఒకవైపు.. మున్సిపల్ ఎన్నికలు మరోవైపు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మలి విడత జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి ఇప్పుడు రాజమండ్రి కార్పొరేషన్ పై ఉంది. ఇక్కడ మేయర్ పదవిని పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థిని బరిలో దించింది. 72 డివిజన్లో విస్తరించి ఉన్న రాజమండ్రి కార్పొరేషన్ లో 4.63 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 26న పోలింగ్ జరగనుంది. 30న ఫలితాలు వెల్లడించనున్నారు. తొలిసారిగా మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుండడం.. పైగా ఈ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో సామాజిక, రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా వేడెక్కాయి.

రేసులో 13 మంది…

రాజమండ్రి మేయర్ రేసులో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం ఎన్డీఏ కూటమి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కేంద్రీకృతమైంది. కూటమి ఒప్పందంలో భాగంగా మేయర్ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాసి వెంకట్రావు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కోడలు బుడితి అన్విత, వైసిపి రెబల్ నేత అజ్జరపు వాసు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

కార్పొరేటర్ గా అనుభవం…

కూటమి మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన రేలంగి శ్రీదేవి గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఆమె పేరు సుపరిచితం కావడం కలిసి వచ్చే అంశం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 70 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. ఎంపీగా పురందేశ్వరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి దాసి వెంకట్రావుకు సామాజిక వర్గ సమీకరణలు, గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతు కలిసి వచ్చే అంశాలు. కూటమికి అండగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలు కలిసికట్టుగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ బిజెపికి సంస్థాగత బలం తక్కువ కావడంతో.. టిడిపి, జనసేన ఓట్లు కీలకం కానున్నాయి.

ఓట్ల చీలిక…

రాజమండ్రి మేయర్ ఎన్నికల్లో ఈసారి ఓట్ల చీలిక కీలకపాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్ తరపున హర్ష కుమార్ కోడలు అన్విత బరిలో ఉండడంతో సాంప్రదాయ దళిత, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు చీలే అవకాశం ఉంది. వైసిపి నేత అజరపు వాసు రెబల్గా పోటీ చేయడం వల్ల వైసిపి ఓటు బ్యాంకు కు గండి పడే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమిలోని కొన్ని డివిజన్లో ఉన్న రెబల్ అభ్యర్థుల బెడద మేయర్ గా పోటీ చేస్తున్న రేలంగి శ్రీదేవి మెజారిటీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజమండ్రి నగర ఓటర్లు ఈసారి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రాబోయే గోదావరి పుష్కరాలతో నగర అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థికి మేయర్ పీఠం అప్పగిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీగా వస్తాయని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో మాత్రం వైసిపి పట్ల ఒక రకమైన సానుభూతి కనిపిస్తోంది.

కూటమికే అనుకూలం…

రాజమండ్రి కార్పొరేషన్ లో పరిస్థితులు గమనిస్తే మాత్రం మేయర్ పీఠం కోసం హారహోరి పోరు తప్పేలా లేదు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణం, అధికార బలం, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ల పట్టు కారణంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి విజయవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. దీనికి తోడు బలమైన కాంగ్రెస్ అభ్యర్థితో పాటు వైసిపి రెబల్ అభ్యర్థి ఉండడం కూటమికి కలిసివచ్చే అంశం. కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఇక్కడి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు