ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రసాయన వాయువు లీక్ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. వరంగల్ క్రాస్ రోడ్ వద్ద ఘాటైన రసాయన వాసనలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వాయువు ప్రభావం మరింత వ్యాపించే ప్రమాదం ఉందని భావించిన వ్యాపారులు ముందుజాగ్రత్త చర్యగా తమ దుకాణాలను మూసివేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. లీకేజీ ప్రభావాన్ని తగ్గించేందుకు నీటిని చల్లుతూ చర్యలు చేపట్టారు.
అయినప్పటికీ ఘాటైన వాసన తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ ఘటనలో విషవాయువు ప్రభావానికి గురై ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ఏ రసాయనం లీక్ అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనతో వరంగల్ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
also read: రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యం మెరుగు.. కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్న వైద్యులు!
