దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను నటిగా ప్రయాణం సాగించిన తొలినాళ్లలో ఎదురైన కొన్ని అసౌకర్యకరమైన అనుభవాలను హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా వెల్లడించారు. తమిళ, తెలుగు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో హీరోయిన్ల నటన కంటే వారి శారీరక రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కెమెరా ముందు కొన్ని శరీర భాగాలు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రాస్ ధరించాలని దర్శకుల నుంచి సూచనలు వచ్చేవని తెలిపారు.
శుభాంకర్ మిశ్రా నిర్వహించిన యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తాప్సీ.. దక్షిణాది సినిమాల్లో తాను గమనించిన అప్పటి పని తీరును వివరించారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం, తెరపై విజువల్ అప్పీల్ పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారని, ఈ క్రమంలో హీరోయిన్ల లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారని చెప్పారు.
సినిమా సెట్లలో మహిళా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో దర్శకులు ఇలాంటి సూచనలను నేరుగా హీరోయిన్లకు చెప్పడానికి ఇబ్బంది పడేవారని తాప్సీ వెల్లడించారు. దర్శకుడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌కు, అక్కడి నుంచి స్టైలింగ్ లేదా హెయిర్ విభాగంలో పనిచేసే మహిళా సిబ్బందికి సమాచారం చేరేదని, చివరకు వారి ద్వారా హీరోయిన్లకు ఆ సూచనలు అందేవని వివరించారు.
ముఖ్యంగా పాటల చిత్రీకరణ సమయంలో ఈ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా ఉండేవని ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ మధ్యలోనే కాస్ట్యూమ్స్ మార్చుకుని తిరిగి సెట్‌కు రావాల్సి వచ్చేదని తెలిపారు. అలా వచ్చిన తర్వాత తమ లుక్‌లో ఆశించిన మార్పు కనిపిస్తోందా లేదా అని సెట్లోని వారు పరిశీలించేవారని, అవసరమైతే మరోసారి దుస్తులు మార్చుకోవాలని చెప్పేవారని పేర్కొన్నారు.
దక్షిణాది చిత్రాల్లో బొడ్డు భాగాన్ని హైలైట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని, హిందీ సినిమాల్లో మాత్రం క్లీవేజ్పై దృష్టి పెట్టేవారని తాప్సీ వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో మహిళా నటీమణులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, తెరపై అందానికి ఇచ్చే ప్రాధాన్యంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలోనూ తాప్సీ వెల్లడించిన అనుభవాలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
also read: శబరిమల భక్తులకు అలర్ట్.. పంబ నదిలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా!
