క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల ప్రాణాలను బలిగొంది. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు బీబీగూడెం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. చివ్వేంల మండలంలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కోట్ల రజిత, అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పిల్లల జగ్గుతండాకు చెందిన గుగులోతు రక్మ ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో బీబీగూడెం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఏ మిక్స్ కంపెనీకి చెందిన టిప్పర్ లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న తీవ్రతకు ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఒకే విద్యాసంస్థలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో గురుకుల పాఠశాలలో విషాదం అలుముకుంది. విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయినుల ఆకస్మిక మరణవార్తతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు తమ కుటుంబాలకు ఆధారంగా ఉన్న మహిళలు ఇలా అర్ధంతరంగా దూరం కావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
also read : దారుణ ఘటన…! యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు….
