చలికాలం మొదలైందంటే చాలు చాలామందిని వేధించే ప్రధాన సమస్య ముక్కు దిబ్బడ. చల్లటి గాలి, వాతావరణ మార్పుల వల్ల జలుబు చేసి ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం సర్వసాధారణం. అయితే దీనికోసం మందుల వెంట పడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతోనే సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె లేదా పుదీనా నూనె వేసి ఆవిరి పీల్చడం వల్ల మూసుకుపోయిన శ్వాస నాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల ముక్కు దిబ్బడ తగ్గి ఊపిరి తీసుకోవడం చాలా సులభమవుతుంది. అలాగే, చలికాలంలో దాహం వేయకపోయినా శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. తరచూ గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండటం వల్ల ముక్కులో పేరుకుపోయిన గట్టి శ్లేష్మం కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది.
మరో చక్కటి గృహ వైద్యం పసుపు పాలు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ముక్కు లోపల ఏర్పడిన వాపు తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.వీటితో పాటు రోజువారీ ఆహారంలో హెర్బల్ టీని చేర్చుకోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లం, పసుపు, లవంగాలు లేదా తులసి ఆకులు వేసి మరిగించిన వేడివేడి హెర్బల్ టీ తాగడం వల్ల గొంతుకు హాయిగా ఉండటమే కాకుండా ముక్కు మార్గాలు పూర్తిగా క్లియర్ అవుతాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.
వైభవంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. తారల సందడి మధ్య కొత్త జీవితంలోకి అడుగు!
