Homeసినిమారమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకుల వార్తలకు చెక్.. మా బంధం ఇప్పటికీ అలాగే ఉందంటూ నటి క్లారిటీ!

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకుల వార్తలకు చెక్.. మా బంధం ఇప్పటికీ అలాగే ఉందంటూ నటి క్లారిటీ!

సీనియర్ నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ దాంపత్య జీవితంపై కొంతకాలంగా వినిపిస్తున్న వదంతులకు తెరపడింది. వీరిద్దరూ విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రమ్యకృష్ణ స్వయంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పటికీ భార్యాభర్తలుగానే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను వెల్లడించేందుకు తాను ఆసక్తి చూపించనని, ఎక్కువగా తన వృత్తికి సంబంధించిన అంశాలకే పరిమితమవుతానని తెలిపారు. అయితే కృష్ణవంశీతో తన అనుబంధంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తాను, కృష్ణవంశీ వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నప్పటికీ తమ వైవాహిక బంధం మాత్రం కొనసాగుతోందని రమ్యకృష్ణ వివరించారు. కెరీర్, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరస్పర అవగాహనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

తమ కుమారుడు పుట్టిన సమయంలో తాను సీరియళ్లలో బిజీగా ఉండేదాన్నని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వచ్చేదని తెలిపారు. తన ప్రయాణాల సమయంలో కుమారుడు తరచూ అనారోగ్యానికి గురవడంతో అతడి చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెన్నైలోనే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చర్చించి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

కాగా, రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటూ తన కుమారుడి చదువుతో పాటు కెరీర్‌పై దృష్టి సారిస్తుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ సినీ దర్శకత్వ పనులను కొనసాగిస్తున్నారు.

ఇలా ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉంటుండటంతో వారి వైవాహిక జీవితంపై కొంతకాలంగా అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారాలకు స్పష్టత వచ్చింది. దూరంగా ఉంటున్నప్పటికీ తమ మధ్య అనుబంధం కొనసాగుతోందని ఆమె చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

also read: తెలంగాణలో సందీప్ సక్సెస్ అవుతారా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు