క్రైమ్ మిర్రర్ : రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల వస్తువులను దొంగిలిస్తూ తిరుగుతున్న ముగ్గురు పాత నేరస్థులకు పోలీసులు చెక్ పెట్టారు. సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2.88 లక్షల విలువైన 19 గ్రాముల బంగారు బిళ్లలు, మోటరోలా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జైలు నుంచి వచ్చినా మారని తీరు
పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ దబీల్‌పూర్‌కు చెందిన కేఆర్ ముత్యాలు అలియాస్ కరోలా ముత్యాలు (25), మల్కాజిగిరికి చెందిన శ్రీరామ సాయికుమార్ అలియాస్ సైకో సాయి (26), సికింద్రాబాద్ తుకారాంగేట్ బోయా బస్తీకి చెందిన గౌరి కిశోర్ శశాంత్ (30) స్నేహితులు. గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో పట్టుబడి జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత తమ పాత పద్ధతినే కొనసాగించారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ఈ ముగ్గురు కొన్ని నెలల క్రితం మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో కలుసుకున్నారు. తిరిగి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్లు, రైళ్లను తమ లక్ష్యంగా ఎంచుకున్నారు.
నిద్రిస్తున్న ప్రయాణికులే లక్ష్యం
ప్లాట్‌ఫారమ్‌లపై నిద్రిస్తున్న ప్రయాణికులతో పాటు నెమ్మదిగా కదులుతున్న రైళ్లలోని వారిని గమనించి వారి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించేవారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని యథాతథంగా విక్రయించకుండా కరిగించి చిన్న బిళ్లలుగా మార్చి అమ్మేవారు. మరో నిందితుడు శశాంత్‌కు మొబైల్ ఫోన్ల భద్రతా వ్యవస్థలపై పరిజ్ఞానం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఫోన్లను ఉపయోగించి యూపీఐ లావాదేవీల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేసేందుకు ప్రయత్నించేవారని వెల్లడించారు.
ఆరు కేసుల దర్యాప్తుతో చిక్కిన నిందితులు
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆరు దొంగతనాల కేసులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేర చరిత్ర బయటపడింది. వారి వద్ద నుంచి 19 గ్రాముల బంగారు బిళ్లలు, మోటరోలా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.2.88 లక్షలుగా పోలీసులు వెల్లడించారు.
పోలీసు బృందానికి రివార్డులు
రైల్వే ఎస్పీ వై. సాయి శేఖర్, డీఎస్సార్పీ ఎస్.ఎన్. జావెద్ పర్యవేక్షణలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ బి. సాయీశ్వర్ గౌడ్, ఎస్సైలు సుబ్బారెడ్డి, మాధవ్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్‌తో పాటు ఇతర సిబ్బందిని రైల్వే ఐజీపీ కె. రమేష్ నాయుడు అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రైల్వే ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ల విషయంలో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
also read : జలమండలి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో వరుస మరణాలు.. రెండు నెలల్లో 9 మంది మృతి
