-
పునరుద్ధరించిన హైడ్రా
-
రూ.1200 కోట్ల విలువైన భూమి పరిరక్షణ
-
మాదాపూర్, కొండాపూర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
-
చెరువుగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన వైనం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాదులో ఇప్పుడు హైడ్రా పేరు మరోసారి మార్మోగిపోతోంది. ఐటీ కారిడార్ లోని మాదాపూర్ శిల్పారామం ఎదురుగా ఉన్న చారిత్రక తుమ్మిడి కుంట చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. దశాబ్దాలుగా సాగిన ఆక్రమణలు, కబ్జాల కారణంగా 14 ఎకరాలకు కూచించుకుపోయిన ఈ చెరువును.. హైడ్రా చేపట్టిన సమగ్ర పునరుద్ధరణ చర్యలతో తిరిగి తన పూర్వ విస్తీర్ణమైన దాదాపు 30 ఎకరాల రూపంలోకి వచ్చింది. గతంలో తీవ్ర దుర్గంధం, మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారంతో కాలుష్య కాసారం గా మారిన తుమ్మిడి కుంటను అద్భుతమైన పర్యావరణ వేదికగా, ఆహ్లాదకర పర్యాటక కేంద్రంగా హైడ్రా తీర్చిదిద్దింది.. పునరుద్ధరించిన తుమ్మిడికుంటను నవంబర్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారు. నగర ప్రజలకు అంకితం చేయనున్నారు.
గత రెండేళ్లుగా…
గత రెండేళ్ల కిందట నుంచి తుమ్మిడి కుంట పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. 2024 ఆగస్టు 24న ఎన్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం కీలకమైన మలుపుగా నిలిచింది. ఈ సాహసోపేత చర్యలతో పాటు చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలోని ఇతర ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం ద్వారా హైడ్రాయకంగా 16 ఎకరాల చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అత్యంత ఖరీదైన మాదాపూర్ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.1200 కోట్ల కు పైగా విలువైన ప్రజా ఆస్తులను కబ్జాదారుల భారీ నుంచి రక్షించినట్లు అయింది. అనంతరం చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, భవన నిర్మాణ శిథిలాలు, పేరుకుపోయిన పూడికను దాదాపు 15 అడుగుల లోతు వరకు వందలాది లారీల ద్వారా తొలగించి.. చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని.. భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు.
వర్షాకాలంలో ముంపు…
వాస్తవానికి ఏటా కొండాపూర్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాకాలంలో తీవ్ర ముంపు సమస్య ఉంది. ఇప్పుడు ఈ చెరువు పునరుద్ధరణతో శాశ్వత పరిష్కారం లభించింది. గతంలో వర్షపు నీరు సాఫీగా సాగక శిల్పారామం పరిసరాలు పూర్తిగా జలమయమయ్యే దుస్థితి ఉండేది. దీనికి చెక్ పెడుతూ మూడు కొత్త ఇన్ లెట్లు, ఒక అవుట్ లెట్ ను కూడా హైడ్రా పునర్నిర్మించింది. తద్వారా పరిసరాల నుంచి వచ్చే వరద నీరు నేరుగా తుమ్మిడి కుంటలోకి.. అక్కడి నుంచి దిగువన ఉన్న ముండ్ల కత్వ చెరువులోకి సహజ సిద్ధంగా ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. పరిసర హాస్టళ్లు, వాణిజ్య సంస్థల నుంచి ములుగు నీరు చెరువులోకి చేరకుండా 1200mm వ్యాసం కలిగిన ప్రత్యేక పైప్లైన్ ద్వారా డ్రైనేజీ ని మళ్లించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఎస్ టి పి ని కూడా ప్రతిపాదించడంతో.. దిగువన ఉన్న మూసీ నదిపై కూడా కాలుష్యభారం గణనీయంగా తగ్గనుంది.
పర్యాటక ప్రాంతంగా…
మరోవైపు చెరువు గట్టును పర్యాటక కేంద్రంగా మార్చారు. దాదాపు 20 కోట్ల రూపాయల ఖర్చుతో వినోద, విశ్రాంతి కేంద్రంగా హైట్రా అభివృద్ధి చేసింది. చెరువు చుట్టూ 1.25 కిలోమీటర్ల మేర అధునాతన వాకింగ్ ట్రాక్, పచ్చదనంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్, కూర్చునేందుకు వీలుగా బెంచీలు, రెండు గెజిబోలు, ప్రత్యేక యోగా ప్లాట్ ఫామ్, అందమైన రోజు గార్డెన్ ను తీర్చిదిద్దారు. చెరువు పరిరక్షణ కోసం ఫుల్ ట్యాంక్ లెవెల్ వెంబడి శాశ్వత ప్రహరీ గోడతో పాటు రక్షణ ఫెన్సింగ్, ప్రవేశాన్ని నియంత్రించేందుకు రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. హైడ్రా తొలిదశలో చేపట్టిన ఆరు కీలక చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టులు తుమ్మిడికుంట ఒకటి. ఇప్పటికే మూడు చెరువులను పునరుద్ధరించి సీఎం రేవంత్ చేతులమీదుగా ప్రారంభించారు కూడా. ఇప్పుడు తుమ్మిడి కుంట నాల్గవది.
