Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో వెబ్‌ల్యాండ్ భూ రికార్డుల కుంభకోణం.. నలుగురు అరెస్ట్.. తెరపైకి సంచలన విషయాలు!

ఏపీలో వెబ్‌ల్యాండ్ భూ రికార్డుల కుంభకోణం.. నలుగురు అరెస్ట్.. తెరపైకి సంచలన విషయాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల భద్రతపై ఆందోళన కలిగించే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన వెబ్‌ల్యాండ్ (Webland) పోర్టల్‌లో అక్రమంగా చొరబడి భూముల వివరాలను మార్చిన ముఠా గుట్టును సీఐడీ అధికారులు బయటపెట్టారు. నిబంధనలను పక్కనపెట్టి ఆన్‌లైన్ భూ రికార్డుల్లో నకిలీ పట్టాదారుల పేర్లు నమోదు చేసిన ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు.

సీఐడీ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని ఇండ్లచెరువు, పడమర లక్ష్మీపురం గ్రామాలకు చెందిన సుమారు 6.55 ఎకరాల భూమి రికార్డుల్లో అక్రమ మార్పులు చోటుచేసుకున్నాయి. సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక మ్యుటేషన్ ఉత్తర్వులు లేకుండానే కొత్త వ్యక్తుల పేర్లు వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ అసాధారణ మార్పులను గుర్తించిన అధికారులు విచారణ చేపట్టడంతో అక్రమాల వ్యవహారం బయటపడింది.

ఈ కేసును లోతుగా పరిశీలించిన సీఐడీ అధికారులు కీలక విషయాలను గుర్తించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కు చెందిన ఉన్నతాధికారి యూజర్ ఐడీని దుర్వినియోగం చేసి భూ రికార్డుల్లో మార్పులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కంప్యూటర్ వ్యవస్థలోకి అనధికారికంగా ప్రవేశించడం, డేటాను డౌన్‌లోడ్ చేయడం, మాల్వేర్ ప్రవేశపెట్టడం, నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగించడం, నకిలీ రికార్డుల సృష్టి, మోసం వంటి ఆరోపణలపై పోలీసులు పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో వడ్లమూడి ఏడుకొండలు, సాయికుమార్, వేముల వెంకట్రావు, షేక్ బాషా అనే నలుగురిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అడంగల్ భూ రికార్డుల సమాచారంతో కూడిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్లను స్వాధీనం చేసుకున్నారు.

వెబ్‌ల్యాండ్‌లో భూముల యజమానుల పేర్లను అక్రమంగా మార్చేందుకు నిందితులు పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ వ్యవహారం వెనుక మరికొందరు వ్యక్తులు కూడా ఉండొచ్చని సీఐడీ అనుమానిస్తోంది. నకిలీ భూ రికార్డుల సృష్టిలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఈ నెట్‌వర్క్‌కు సహకరించిన వారు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రభుత్వ భూ రికార్డుల వ్యవస్థలోనే అక్రమ మార్పులు జరగడం ఈ ఘటనతో చర్చనీయాంశంగా మారింది. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో భద్రంగా ఉండాల్సిన వ్యవస్థను దుర్వినియోగం చేసిన ఈ ముఠా వ్యవహారంలో దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: తొమ్మిది పెళ్లిళ్లు .. విభేదాలు… విడాకులు… ఏడో భర్తపై కేసు కొట్టివేసిన హైకోర్టు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు