కర్ణాటకలో ఆసక్తికరమైన వివాహ వివాదానికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తన ఏడో భర్తపై ఓ మహిళ దాఖలు చేసిన గృహహింస, వరకట్న వేధింపుల కేసును న్యాయస్థానం రద్దు చేసింది. మహిళ చేసిన ఆరోపణలకు తగిన నిర్దిష్ట ఆధారాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో క్రిమినల్ కేసు విచారణను కొనసాగించడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి దారితీస్తుందని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే.. హొసపేటకు చెందిన రాజకీయ నాయకుడు రాజా హుస్సేన్‌కు, తబస్సుమ్‌కు 2022 జనవరిలో వివాహం జరిగింది. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. అదే ఏడాది ఆగస్టులో తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తబస్సుమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 498ఏ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు ఉడుపి కోర్టులో విచారణ దశలో ఉండగా.. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ రాజా హుస్సేన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా రాజా హుస్సేన్ సంచలన ఆరోపణలు చేశారు. తబస్సుమ్‌కు గతంలోనే ఎనిమిది వివాహాలు జరిగాయని, తాను ఆమెకు ఏడో భర్తనని పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం, కొంతకాలానికే విభేదాలు సృష్టించుకోవడం, ఆ తర్వాత కేసులు నమోదు చేసి డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ఆమెకు అలవాటుగా మారిందని ఆరోపించారు. తన వాదనలకు మద్దతుగా కొన్ని పత్రాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచారు.
అయితే ఈ ఆరోపణలను తబస్సుమ్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. ఆమె గతంలో నాలుగు వివాహాలు మాత్రమే చేసుకున్నారని, ప్రతి వివాహం తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న అనంతరమే మరో పెళ్లి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళ చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు స్పష్టంగా లేవని, వాటిని నిరూపించే నిర్దిష్ట ఆధారాలు కూడా కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కేవలం పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారనే కారణంతోనే ఆరోపణలకు బలం చేకూరినట్లు భావించలేమని పేర్కొంది.
ఈ సందర్భంగా న్యాయస్థానం మరో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గతంలో ఎన్ని వివాహాలు చేసుకున్నారనే అంశాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని, నైతికతను లేదా నేర ప్రవృత్తిని నిర్ణయించలేమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో వారి ఫిర్యాదులను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని పేర్కొంది.
అయితే క్రిమినల్ చట్టాలను వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉపయోగించకూడదని హైకోర్టు హితవు పలికింది. ప్రస్తుత కేసులో ఉన్న ఆధారాల ప్రకారం విచారణ కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాజా హుస్సేన్‌పై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
also read: ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు.. ఈ నెల13న హైకోర్టు విచారణ
