ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 13న ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను విచారించనుంది. సచివాలయ ఉద్యోగులు, రోడ్లు భవనాల శాఖకు చెందిన ఇంజనీర్లు, టీటీడీ సిబ్బంది, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
ప్రధానంగా సూపర్‌న్యూమరరీ పోస్టుల కేటాయింపు, అంతర్రాష్ట్ర ఉద్యోగుల సీనియారిటీ నిర్ణయం, ఇతర సర్వీసు ప్రయోజనాల కల్పనకు సంబంధించిన అంశాలు ఈ కేసుల్లో ప్రస్తావనకు వచ్చాయి. 2018 నుంచి వివిధ సందర్భాల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు, ఆదేశాలను అధికారులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.
గత అక్టోబర్ 30న ఈ పిటిషన్లపై విచారణ జరగ్గా, తదుపరి విచారణను నవంబర్ 13కు ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పరిపాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఖాళీల వివరాలను సేకరించడం, కొత్త పోస్టుల ఏర్పాటు, ఉద్యోగుల సీనియారిటీ వివాదాలను పరిష్కరించడం వంటి ప్రక్రియలకు మరింత సమయం అవసరమని కోరారు.
అయితే, న్యాయస్థానం గతంలో స్పష్టంగా ఆదేశించినప్పటికీ వాటిలో కీలకమైనవి ఇంకా అమలుకు నోచుకోలేదని పిటిషనర్ల తరఫు వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, ఈ కేసుల్లో తాజాగా ప్రతివాదులుగా చేరిన అధికారులు రెండు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని ధర్మాసనం గతంలో ఆదేశించింది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా స్పష్టం చేసింది. దీంతో నవంబర్ 13న జరిగే విచారణలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
also read: సోనియా గాంధీపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు.. గాంధీ కుటుంబంలో జరిగిన మరణాలపై అనుమానాలు!
