Homeఆంధ్ర ప్రదేశ్స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అరుదైన గుర్తింపు.. రాష్ట్రానికి 6 జాతీయ అవార్డులు!

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అరుదైన గుర్తింపు.. రాష్ట్రానికి 6 జాతీయ అవార్డులు!

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ అవార్డుల్లో విశేష గుర్తింపు లభించింది. పట్టణ పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రంగా ఏపీకి మొత్తం ఆరు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అందుకోనుంది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించనున్న 10వ స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హాజరుకానున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున ఆయన పురస్కారాలను స్వీకరించనున్నారు.

ఆరు విభాగాల్లో ఏపీకి అవార్డులు

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థలు ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ విభాగంలో అవార్డులు సాధించాయి.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ‘సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్’ విభాగంలో పురస్కారాన్ని దక్కించుకుంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ‘ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్’ అవార్డుకు ఎంపికైంది. మరోవైపు 20 వేలలోపు జనాభా కలిగిన పట్టణాల విభాగంలో కుప్పం మున్సిపాలిటీ ‘స్వచ్ఛ సిటీ’ అవార్డును అందుకోనుంది.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రకు గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం పట్టణ పారిశుద్ధ్యంలో సానుకూల ఫలితాలను అందిస్తోందని అధికారులు తెలిపారు. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంబంధిత నగరాల మున్సిపల్ కమిషనర్లు సైతం పాల్గొననున్నారు. రాష్ట్రంలోని పలు పట్టణాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మున్సిపల్ యంత్రాంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

also read:  దీపావళి వేళ కాల్పుల కలకలం.. రాష్ట్రపతి భవన్ భద్రతా విధులు నిర్వహించే జవాన్‌పై దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు