టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరో రంగానికి విస్తరించారు. ఇప్పటివరకు సినిమాలు, థియేటర్లు, హెల్త్ అండ్ వెల్‌నెస్ వంటి వ్యాపారాల్లో ఆసక్తి చూపిన ఆయన.. తాజాగా గేమింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘షాట్‌గన్ గేమ్స్’లో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పీసీ, కన్సోల్ గేమ్స్‌ను రూపొందిస్తున్న ఈ సంస్థతో మహేశ్ బాబు భాగస్వామ్యం కావడం ఆసక్తికరంగా మారింది. అమెరికా, యూరప్, యూకే వంటి విదేశీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని కొత్త గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు ‘టేక్‌డౌన్ జెనెసిస్’ అనే పేరు పెట్టారు. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రూపొందనున్న ఈ గేమ్‌కు దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వం వహించనున్నారు. భారతీయ గేమింగ్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి గేమ్స్‌ను రూపొందించే సామర్థ్యం భారతీయ ప్రతిభకు ఉందని చాటిచెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కొత్త భాగస్వామ్యంపై మహేశ్ బాబు కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారతదేశంలో సృజనాత్మకతకు, ప్రతిభకు కొదవ లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త రంగంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని, భారతీయ టాలెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు వ్యాపార రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న మహేశ్ బాబు.. ఇప్పుడు గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా భారతీయ గేమింగ్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం ఆసక్తిని పెంచుతోంది. అయితే, షాట్‌గన్ గేమ్స్‌లో మహేశ్ బాబు పెట్టిన పెట్టుబడి విలువ ఎంతన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.
also read: ‘రామాయణం’ సినిమాకు భారీ ఊరట.. పైరసీకి చెక్ పెట్టిన బాంబే హైకోర్టు!
