Homeక్రైమ్కోదాడలో భారీగా గంజాయి పట్టివేత.. 150 కిలోల సరుకు సీజ్

కోదాడలో భారీగా గంజాయి పట్టివేత.. 150 కిలోల సరుకు సీజ్

క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కారులో తరలిస్తున్న సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఈశ్వర్, శివప్ప, ఒడిశాకు చెందిన రాజు కలిసి గంజాయిని కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయించాలని పథకం రూపొందించారు. ఇందుకోసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్‌లను సంప్రదించి రవాణా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ.20 వేలతో పాటు సరుకు విక్రయించిన తర్వాత మరో రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

గతంలోనూ గంజాయి రవాణా

నిందితులు నెల రోజుల క్రితం కూడా 27 గంజాయి ప్యాకెట్లను రాజమండ్రి నుంచి బెంగళూరుకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా అక్టోబర్ 29న కర్ణాటక నుంచి బయలుదేరిన సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్ 30వ తేదీ రాత్రికి రాజమండ్రి చేరుకున్నారు. మరుసటి రోజు ఒడిశా నుంచి తీసుకొచ్చిన 62 ప్యాకెట్లలోని సుమారు 150 కిలోల గంజాయిని హోండా సిటీ కారులో నింపుకుని బెంగళూరుకు బయలుదేరారు.

పోలీసులను చూసి పరారయ్యే యత్నం

గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టిన కోదాడ పోలీసులు అక్టోబర్ 31న జాతీయ రహదారి-65పై దుర్గాపురం క్రాస్‌రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వేగం పెంచి తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు వెంటాడి కమ్మ కాకతీయ ఫంక్షన్ హాల్ సమీపంలో కారును అడ్డుకున్నారు.

కారులో ఉన్న సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్‌లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా గంజాయి బయటపడింది. మొత్తం 62 ప్యాకెట్లలో ఉన్న సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన హోండా సిటీ కారు, రూ.15 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

మరో ముగ్గురి కోసం గాలింపు

ఈ కేసులో అరెస్టయిన ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రధానంగా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న ఈశ్వర్, శివప్ప, రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని వెల్లడించారు.

మాదకద్రవ్యాలపై నిరంతర నిఘా

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐలు అజయ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, నవీన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
also read : మేడ్చల్ జిల్లాలో విషాదం.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు