Homeతెలంగాణ ‘ఇరుముడి’ చిత్రానికి కొత్త చిక్కులు.. మైత్రీ మూవీ మేకర్స్‌కు కార్మిక శాఖ నోటీసులు!

 ‘ఇరుముడి’ చిత్రానికి కొత్త చిక్కులు.. మైత్రీ మూవీ మేకర్స్‌కు కార్మిక శాఖ నోటీసులు!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమా విజయానికి సంబంధించిన అంశం కాకుండా, బాలనటి విషయంలో తలెత్తిన వివాదం చిత్ర బృందానికి కొత్త సమస్యగా మారింది. బాలకార్మిక చట్టంలోని నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదుతో తెలంగాణ కార్మిక శాఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది.

జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్ బాబు ఈ విషయంపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు నిర్మాతలను వివరణ కోరుతూ నోటీసులు పంపించారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రంలో రవితేజ కుమార్తె మణెమ్మ పాత్రను బాలనటి బేబీ నక్షత్ర పోషించింది. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిన్నారి విషయంలో చట్టపరమైన నిబంధనలు సరిగ్గా అమలు చేశారా? లేదా? అనే అంశంపై ఇప్పుడు విచారణ జరగనుంది.

ముఖ్యంగా బాలికతో సినిమా షూటింగ్ చేయించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? ఆమె తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం పొందారా? బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతాన్ని ఆమె పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అనే వివరాలను కార్మిక శాఖ అధికారులు అడిగారు.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో బాలిక పని గంటలు ఎంత? ఆమె విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనే అంశాలపైనా ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో విచారణకు హాజరుకావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులను కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆదేశించారు. సంస్థ తరఫున నిర్మాతలు స్వయంగా లేదా అధీకృత ప్రతినిధి హాజరై తమ వివరణ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.

మరోవైపు, కార్మిక శాఖ జారీ చేసిన నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. విచారణలో సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడిస్తుంది? ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

also read: అబ్బాయి కావాలంటూ దారుణం.. అక్రమ లింగ నిర్ధారణ, బలవంతపు అబార్షన్‌తో 24 ఏళ్ల యువతి మృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు